రాయలసీమ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన చిరంజీవికి, ఆ రాయలు తన ఆముక్తమాల్యదలో 'యామునాచార్యుడి వృత్తాంతం'లో ఆ యామునుడు తన కుమారునికి ఉపదేశించిన రాజనీతిని, గుర్తు చేయాలనే తలంపుతోనే ఈ నా ప్రయాస. ఆ రాయలు తన ప్రజలను ఎలా పాలించాడో ఈ పద్యాల వల్ల కాస్త అంచనా వేయొచ్చు. 1509 లో విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన ఆ రాయలు 2009లో ప్రభవిస్తున్న ఈ అధినాయకుడికి చేస్తున్న రాజనీతి బోధ ఇది. (అందులోని కొన్ని ఆణిముత్యాలు...)క. ఏపట్టున విసువక ర
క్షాపరుఁడవు గమ్ము ప్రజల, చక్కి విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కా పురుషులమీద నిడకు, కార్యభరంబుల్.
తే. రాష్ట్రవర్ధన మెదఁగోరు, రాజు మేలు
రాష్ట్రమును గోరుదాఁనగా, ర్యమొ యనంగ
రాదు బ్రహ్మోత్తరములైన, ప్రజలయేక
ముఖపుఁగోర్కిఁ దదంతరా, త్ముం డొసఁగఁడె.
తే. కార్య మొక్కఁడు కనిన మా, త్సర్యమున నొ
కండు గా దని ఖండించుఁ, గ న్నెఱింగి
ఇరువురును గా దనక కొల్వు, విరిసి మీఁద
నల్ల వాఁడెన్నినది సేయ, నగు శుభంబు.
తే. కన్నొక్కటి నిద్రవోఁబెఱ కంట జాగ
రంబు గావించు భూరుహాగ్రంబు మీఁది
యచ్ఛభల్లంబుగతి భోగ మనుభవించు
నెడను బహిరంతరరులపై దృష్టివలయు.
క. శూరాలాపములకు నతి
శూరుఁడు దానయ్యు నృపతి సోఁకోర్వఁదగు
న్వా రుబ్బుదు రందున నిజ
శూరుత దొరలందుఁ గనుట సూ కార్యమిలన్.
ఆ. హదను వచ్చుదాఁక నపరాధిపై రోష
మాఁగి చెఱుపవలయు హదను వేచి
లక్ష్యసిద్ధిదఅఁక లావున శర మాఁగి
కాఁడ విడుచు వింటి వాఁడువోలె.
తే. దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంట కాల్వలు రచించి
నయము పేదకు నఁరి గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్థ ధర్మములు పెరుఁగు.
క. హితులు హితాహితులు సదా
హితులును నై రాజు నెడల నిటు త్రివిధమునన్
క్షితి ననుచరు లుందురు సం
తతమున్ మఱి వారిఁ దెల్పె దన్ విను మనఘా.
క. చేయునది రాజ్య మఁట యఘ
మే యవధిగ నీఁగువారమే మనఁ జన దా
మ్నాయంబు నశక్యాను
ష్ఠేయముఁ జెప్పదు స్వశక్తిఁ జేయఁగఁ జెప్పున్.
------------------------------------------
*విసుక్కోకుండా ప్రజల్ని రక్షించాలి రాజు. రాజు ప్రజల మేలు కోరితేనే ప్రజలు రాజు మేలు కోరుతారు. ప్రజలంతా కోరిన కోర్కెని పరమేశ్వరుడు తీరుస్తాడు.
*ఎవడినైనా ముందు పెద్దవాణ్ణి చేసి ఆ తర్వాత తగ్గిస్తే వాడు మొదల్లో ఉన్న తన తక్కువ స్థితిని తల్చుకోడు ఉన్నతస్థితి నుంచి కింద పడ్డాననే బాధపడతాడు. కాబట్టి శీలవంతులైన వాళ్ళని గుర్తించి వాళ్ళని క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకురావాలి.
*రైతు ముందుగా పొలాన్ని స్వాధీనం చేసుకుని, తర్వాత దాని చుట్టూ ముళ్ళకంచె నాటి, దుక్కి దున్నే ముందు గడ్డల్ని వేర్లను ఏరేస్తాడు. రాజు తన రాజ్యాన్ని కూడ అలాగే చూసుకోవాలి.
*గట్టివాడొకడు ఒక పని సాధించటానికి మార్గం కనుక్కుని చెప్తే, వాడంటే ఈర్య్ష ఉన్న మరొకడు దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అక్కడ ఎవరి వైపూ వెళ్లకుండా, ఆ తర్వాత మాత్రం మొదటివాడు చెప్పినట్టు చెయ్యి.
*అధికారులు ఎప్పుడూ రాజుకు మిత్రులు కారు; వాళ్ళ రాబడి వాళ్ళు చూసుకునే వాళ్ళే. చెడ్డపనులు చేసే అధికారుల్ని పూర్తిగా వదిలెయ్యకుండా అతిజాగ్రత్తగా నడిపిస్తుండాలి.
*ఎంత చిన్న చోటులోనైనా వ్యవసాయానికి నీళ్ళ వసతులు కలిగించాలి రాజు. దానివల్ల పంటలు పెరిగి పన్ను వసూళ్ళూ ఎక్కువౌతయ్. అలాగే పేదల దగ్గర పన్నులు తక్కువ తీసుకుని, వాళ్ళు వృద్ధిలోకి వచ్చేట్టు చూస్తే తర్వాత వాళ్ళ నుంచి కూడా మంచి ఆదాయమే వస్తుంది. అందుకని ఇళ్ళు, భూములు, పశువులు వదిలేసి వెళ్ళబోయే వాళ్ళని ఆదుకుని వాళ్ళు నిలదొక్కుకునేట్టు చెయ్యాలి.
*ఎప్పుడూ నీతిమార్గంలో నడవాలి రాజు. తను తెలుసుకోవలసిన విషయాలు వీలైనంతగా స్వయంగా తెలుసుకుని ఉండాలి. తెలియని కొద్ది వాటికి ఆప్తుల్ని, మిత్రుల్ని అడగాలి. తెలియని విషయాల్లో తన అభిప్రాయమే ఒప్పనుకోకూడదు.
*రాజు శూరుడైనా తన కొలువులో దొరలు తమని తాము పొగుడుకుంటే విసుగు చూపించకుండా వినాలి. దానివల్ల వాళ్ళకి తృప్తీ కలుగుతుంది, అవసరాల్లో ఇంకా ఉత్సాహంగా కష్టపడతారు.
*వాణిజ్యం పెంచటానికి రేవుల్ని వృద్ధి చెయ్యాలి. ఈతి బాధల వల్ల ఇతర దేశాల జనం వలస వస్తే వాళ్ళని తన శక్తి కొద్ది ఆదుకోవాలి. తోటలు, దొడ్లు, గనులు చూడటానికి ఆప్తులైన వాళ్ళని నియమించాలి.
*రాజుకి ముఖ్యమైన ప్రమాదం లోపలిశత్రువుల నుంచి. అందువల్ల లోపల శత్రువులున్నప్పుడు శత్రురాజు యుద్ధానికొస్తే వాడికి సగం రాజ్యం ఇచ్చైనా సంధి చేసుకుని ముందు లోపలి శత్రువుల్ని అణచాలి.
*ఎవడన్నా మనసుకి నచ్చిన ఆలోచనలు చెప్తే అక్కణ్ణుంచి రాజులు వాణ్ణే మాటిమాటికి సలహా అడుగుతారు. దాంతో వాడికి గర్వం వచ్చి పనులు కావలసిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని రాజుకి చెడ్డ ఆలోచనలు చెప్తాడు. అలాటి వాళ్ళని చారుల ద్వారా గమనిస్తూ వుండాలి ఎప్పుడూ.
*కపటం వున్న మనుషులు నువ్వు బాగున్నప్పుడు పొగుడుతారు, కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతారు. జాగ్రత్తగా గమనించు.
*రాజు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడో అలాగే తన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
*నీ సేవకుల్లో మూడు రకాల వాళ్ళుంటారు ఎప్పుడూ నీ మంచి కోరేవాళ్ళు, మంచిచెడ్డలు రెండూ కోరేవాళ్ళు, చెడే కోరేవాళ్ళు. ఎవరు ఎవరో గ్రహించాలి నువ్వు.
*రాజ్యం చేసేప్పుడు ఎన్నో పాపాలు కట్టుకోకతప్పదు. వీలైనంత అధర్మం జరక్కుండా చూసుకోవటం అవసరం. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు.
ఇందులోని పద్యాలు నేనే 'టైపించినా' పద్యార్థాన్ని మాత్రం కె.వి.ఎస్. రామారావు గారి 'ఈ మాట' వ్యాసం నుంచి ఉదహరించడం జరిగింది. ఇందులో నా మరో ఉద్దేశం అలతి అలతి పదాలతో, 'ఆముక్తమాల్యద' అనే నారికేళపాకాన్ని మెత్తటి లేత కొబ్బరిలా తేటతెలుగులో తెలియజెప్పిన ఈ వ్యాసాన్ని అందరికీ పరిచయం చేయాలని, ఆ అమృతాన్ని ఇక్కడ సేవించండి. (ముఖ చిత్రం ఈనాడు సౌజన్యం)
(మొన్న ఊరికెళ్లినప్పుడు 'ఇంద్ర' సమయంలో మా శిష్యుడు చేయించిన ఇచ్చిన ఈ చిత్రం కనపడింది. మీతో పంచుకొందామని ఇలా...)

3 comments:
Baavundi. Devaraayalu gurinchi raastunna mee krushi abhinandaneeyam.
ఇరగ
హిందూపురం నుంచి డా.అబ్దుల్ కలీం ఇలా అన్నారు...
మీ కృషి అభినందనీయం కానీ మీరు అమెరికా నుండి ప్రజారాజ్యం పార్టీ ని చూసి ఆనందపడటం భూమి నుండి చూసి చంద్రుడి ఉపరితలం ఎంత నున్నగా ఉందో అని చిన్నపిల్లాడు ఆనందించినట్లే ఉంది. నిజం ఏమంటే ప్రస్తుతమున్న సవాలక్ష దిక్కుమాలిన పార్టీలలో అదికూడా ఒకటి. భూమా నాగిరెడ్డి లాంటి ఫ్యాక్షనిష్టులు, వయసుడిగిన జోగయ్యలు,శివశంకర్లు, గమ్యం తెలియని మిత్రాలు, అదికారాన్ని అనుభవించి తిరిగి దానికోసం అర్రులు చాస్తున్న అనేకమంది వలసనేతల కలగూరగంప.
నిజం చెప్పాలంటే మన ప్రపంచవ్యవస్థ సమూలంగా కుళ్ళిపోయింది. దానిని బాగు చేయాలంటే తిరిగి జీసస్,ముహమ్మద్,బుద్ధుడు లాంటి వ్యక్తులు రావలసిందే గానీ చిరంజీవి వల్ల గానీ మరెవరివల్ల గానీ కాదు.
డా.అబ్దుల్ కలీం , హిందూపురం.
Post a Comment