My Name is 'ఇస్మాయిల్'!

గత కొన్నాళ్లుగా తీరిక లేక బ్లాగ్లోకం వైపు రావడం తగ్గించాను. కొత్తగా ఫేస్బుక్కు , ట్విట్టరూ తగులుకున్నాయి మఱి. కానీ 'కొత్తపాళీ' గారి ఆజ్ఞాపన చూశాక రాయక తప్పడం లేదు. అమెరికా జీవితం, ప్రజలు,వారి జీవన వైవిధ్యం, ఇంకా కష్టనష్టాలూ, ఈతిబాధలూ బాగా దగ్గరగా చూసే అవకాశం, వారి నాడి పట్టి చూసే డాక్టరుకే తెలుస్తుంది . అలా రాయడానికి బోలెడంత సరుకుండగా మరి ఈ కొత్త టైటిలేంటీ? అనుకొంటున్నారా!

అమెరికా వరకే కాకుండా నేటి ప్రపంచంలొ జరుగుతున్న చాలా సంఘటనలకు సంబంధం ఉన్న విషయంతో మొదలుపెడదామనుకొన్నాను. మై నేమ్ ఈజ్ 'ఖాన్' సృష్టించిన వివాదం అందరికీ తెలిసిందే. సినిమాలో చెప్తున్న విషయమేంటీ? అన్నది లేశమాత్రం పట్టించుకోకుండానే, ఏదో ఇతర సందర్భంలో ఓ వ్యాఖ్య చేశాడని ఓ మంచి చిత్రాన్ని అడ్డుకునే దురుద్దేశపూర్వక చర్య 'శివసేన' అధినేత 'టైగర్' థాకరే గారిది. చివరికేం జరిగింది? ప్రజాభిమానం ముందు 'పులి' తోక ముడిచింది.

ముందు నుంచీ నేను చెబుతున్న 'common sense' పాయింటు ఒక్కటే. తీవ్రవాది మగవాడని, మగవాళ్లంతా తీవ్రవాదులు ఎలా కారో- కొందరు తీవ్రవాదులు ముస్లింలైనంత మాత్రాన, అందరు ముస్లింలు తీవ్రవాదాలు కారు. ఇది తెలివి, జ్ఞానం, వివేచన ఉన్న పెద్దలకే అర్థం కానప్పుడు, థాకరేల వెంట పరుగులెత్తే సామాన్య జనానికి ఏం అర్థమవుతుంది?

ఎవరు దేశభక్తులో నిర్ణయించేది ఓ 'రా.నా.' కాదు, ప్రజలు. మన ప్రజాస్వామ్యంలో మరోసారి ఇది నిరూపితమైంది. బాలీవుడ్ బాద్షాలకే ఇలాంటి నింద తప్పనప్పుడు, కూరలమ్ముకునే ఏ 'మస్తాన్' కైనా ఎలా తప్పుతుంది. ఈ దేశం మాది కూడా! తరతరాలుగా,  కొన్ని వేల సంవత్సరాలుగా ఈ నేలతో ఉన్న అనుబంధం, కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వీకరించిన మతం కారణంగా పరాయిదయిపోదు.

ఈనాడు దేవదేవుడిగా కొలువబడుతున్న 'షిర్డీ సాయునాథు'ని నోటి వెంట నిరంతరం స్మరించబడిన నామం 'అల్లా మాలిక్!'. ఆయనే ఇప్పుడు బ్రతికుంటే, ఏ పాకిస్థాన్ ఏజెంటో, ఫకీరు వేషంలో తిరుగుతూ ఉన్నాడని చెప్పి మహారాష్ట్ర బహిష్కరణ విధించి ఉండే వారు ఈ మూర్ఖులూ,  ముష్కరులూ. (పాపం శమించు గాక!)

షారూఖ్ చేసిన పాపమేంటీ? పాకిస్థాన్ వాళ్లను మన దేశవాళీ జట్టులో ఆడించుకొంటే తప్పేమిటీ? అనడమే! అందులో తప్పేమైనా ఉంటే పాకిస్థానుతో క్రికెట్ఠాట ఆడడమే మానేస్తే పోలా? ఇండియా-పాకిస్థాన్ మ్యాచుల ముందు ఏ సూపర్ బౌల్లూ దిగదుడుపే! దాయాదుల పోరు జరిగినప్పుడు దేశం యావత్తూ టి.వి.లకే అంకితం అయిపోవడం చిన్నప్పటి నుంచీ కద్దు. 'రామాయణ్', 'మహా భారత్' సీరియల్లంతగా టి.వి.లకు అతుక్కుపోయే వారు. నేటికీ ఆ ఉత్సాహం తగ్గింది లేదు.


షారూఖ్ వంశంలో తండ్రి, తాతలు ఈ దేశంతో మమకారం పెంచుకొన్న వారే, సేవ చేసిన వారే. 'ఆజాద్ హింద్ ఫౌజ్' లో పనిచేయడం దేశభక్తి కాకపోతే, ఇక దేన్ని దేశభక్తి అంటారో? నాకైతే అర్థం కావడం లేదు. థాకరే గారి ఆరాధ్యనీయుడు, దేశభక్తుడూ, ధీరోధాత్తుడూ అయిన 'వీర శివాజి' తండ్రి పేరు 'షాహాజీ', పినతండ్రి పేరు 'షరీఫ్ జీ'. శివాజీ తాత మాలోజీ ఒక ముస్లిం సూఫీ ఫకీరు అయిన 'షాహా షరీఫ్' ఆశీర్వచనాలతో పుట్టినందు వల్ల తన కుమారులిద్దరికీ ఆయన మీద భక్తిభావంతో పెట్టుకొన్న పేర్లివి. అనుమానం ఉన్న ఎవరైనా చరిత్ర పుటల్ని తిరగేయవచ్చు. ఇప్పుడు బ్రతికుంటే షాహాజీ, షరీఫ్ జీలు కూడా తమ పేర్ల కారణంగా వివక్షను ఎదుర్కొని ఉండేవారే. మేము శివాజీ తండ్రి, బాబాయిలమయ్యా అని మొత్తుకున్నా మన 'శివ సైనికులు' వారిని వదిలి ఉండే వారు కారేమో?


ఇక మన షారూఖ్ 'గౌరి'ని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలతో అన్యోన్యంగా కాపురం చేసుకొంటున్నా, తన నటన ద్వారా, చిత్రాల ద్వారా ఈ దేశప్రజల వినోదానికి, ఉల్లాసానికీ తోడ్పడుతూ, తద్వారా వారి మానసిక సంతోషానికి, శారీరక ఆరోగ్యానికీ పరోక్షంగా, ఇతోధికంగా సాయపడుతూ ఉన్నా ఆయన దేశద్రోహి అయ్యాడు. ఏం చేద్దాం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఈ దేశంలో పేర్లతో, మతంతో, ప్రాంతంతో కొలుస్తారని అందరికీ తెలియదు కదా! అందుకే అన్నాడు మహాకవి  "కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు... పేర్లకీ, ఫకీర్లకీ, పుకార్లకీ నిబద్ధులు." Bravo! Sharukh.



షారూఖ్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి చిత్రం 'దీవానా' నుంచి... తన సినిమా జీవితంలోని మొదటి 'షాట్' ఇదే!